లైంగిక వేధింపులపై అప్రమత్తంగా ఉండాలి.. న్యాయ నిపుణుల సూచన
వేములవాడ, అక్టోబర్ 31 (తెలంగాణ వాణి):
బాలబాలికల భద్రతకు పోక్సో చట్టం పటిష్టమైన రక్షణ కవచమని, విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని న్యాయ నిపుణులు సూచించారు. బాలలపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలను అరికట్టడంలో పోక్సో చట్టం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.వేములవాడ ప్రాంతంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ హనుమాజీపేట పాఠశాలలో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ అడోలెసెంట్ సేఫ్టీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు ఏజీపీ సంటి సుజీవన్, జక్కుల పద్మ హాజరై విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, చట్టపరమైన రక్షణలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా న్యాయ నిపుణులు మాట్లాడుతూ.. బాలబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటం క్షమించరాని నేరమని, నేర తీవ్రతను బట్టి కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలిపారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు తమకు ఎదురయ్యే వేధింపులను బయటకు చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించడంతో పాటు వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలికలే కాకుండా బాలురు కూడా తమ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అనుచితంగా తాకినా లేదా వేధింపులకు గురిచేసినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, బాధితులకు అందించే చట్టపరమైన సహాయం గురించి వివరించారు. వేధింపులకు గురైన పిల్లలు మౌనం వీడి ధైర్యంగా ముందుకు రావాలని, వారి రక్షణకు చట్టం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం ద్వారా సురక్షితమైన సమాజ నిర్మాణానికి పునాది వేయవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిట్నేని శ్రీకాంత్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




