తిమ్మాపూర్, అక్టోబరు 31 (తెలంగాణ వాణి ప్రతినిధి):గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా, అధికారులు జారీ చేసిన నోటీసులను సైతం బేఖాతర్ చేస్తూ పనులు కొనసాగిస్తున్న ఘటన తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని శుక్రవారం పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేసినప్పటికీ, యజమాని వాటిని పట్టించుకోకుండా శనివారం తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించడంతో పంచాయతీ సిబ్బంది చర్యలకు దిగారు.గ్రామపంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు సమాచారం అందడంతో కార్యదర్శి శుక్రవారం నిర్మాణ స్థలానికి వెళ్లి నోటీసులు అంటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని స్పష్టంగా సూచించారు. అయినప్పటికీ యజమాని స్పందించకుండా, ‘మాకేమవుతుంది.. మమ్మల్ని ఎవరు అడుగుతారు?’ అన్న ధోరణితో శనివారం కూడా నిర్మాణ పనులు కొనసాగించినట్లు సమాచారం.దీంతో శనివారం ఉదయం 11 గంటల సమయంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సిబ్బందితో కలిసి నిర్మాణ స్థలానికి చేరుకున్నారు. అక్కడ పనులు చేస్తున్న కార్మికులను వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించారు. నిర్మాణానికి ఉపయోగిస్తున్న తట్టలు, పారాలను స్వాధీనం చేసుకుని గ్రామపంచాయతీ కార్యాలయానికి తరలించారు.ఇదిలా ఉండగా, గ్రామపంచాయతీకి చెందిన నల్లా కనెక్షన్ను సైతం అనుమతి లేకుండా తీసుకుని నిర్మాణ అవసరాలకు నీటిని వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, నోటీసులను పట్టించుకోకపోవడం, పంచాయతీ వనరులను అనధికారికంగా వినియోగించడంపై గ్రామస్థుల ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పనులు కొనసాగించడం పై పంచాయతీ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.





