వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ చైర్మన్‌గా లాయక్ పాషా ఏకగ్రీవం
విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో మరింత ముందుకు
వేములవాడ, సెప్టెంబర్ 28 (తెలంగాణ వాణి): వేములవాడ ప్రాంతంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు నివేశన స్థలాలు అందించడంతో పాటు, ఇప్పటికే మంజూరైన స్థలాలతో ఏర్పడుతున్న జర్నలిస్టు కాలనీ అభివృద్ధికి సమన్వయంతో ముందుకు సాగేందుకు వేములవాడ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ చైర్మన్‌గా లాయక్ పాషాను ఏకగ్రీవంగా నియమిస్తూ ప్రెస్ క్లబ్ కార్యవర్గం తీర్మానం చేసింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో సర్వే నంబర్ 391లో జర్నలిస్టుల కోసం మంజూరైన నివేశన స్థలాలతో కాలనీ రూపుదిద్దుకుంటోంది. రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు లాయక్ పాషా తెలిపారు. సుమారు 60 మంది జర్నలిస్టులకు నివేశన స్థలాలు కల్పించేందుకు జరిగిన ప్రయత్నాల్లో గతంలోనూ తాను భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. జర్నలిస్టు కాలనీలో బొడ్రాయి ఏర్పాటు, ఇంటి నంబర్ తీసుకోవడం వంటి కార్యక్రమాలు తన ఆధ్వర్యంలో జరిగాయని, కాలనీకి విద్యుత్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. కాలనీ మౌలిక వసతుల కోసం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించామని, రెండు బోరుబావులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంజూరైన స్థలాలతో పాటు ఇంకా స్థలాలు పొందాల్సిన అర్హులైన జర్నలిస్టులకు కూడా న్యాయం జరిగేలా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి కృషి చేస్తానన్నారు. ఇప్పటికే మంజూరైన స్థలాలను పూర్తి స్థాయి జర్నలిస్టు కాలనీగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ముందుకు సాగుతామని తెలిపారు. జర్నలిస్టులందరినీ కలుపుకొని కాలనీ అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తామని లాయక్ పాషా పేర్కొన్నారు. హౌసింగ్ సొసైటీ చైర్మన్‌గా నియమితులైన లాయక్ పాషాకు పుర ప్రముఖులు, న్యాయవాదులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, సహచర జర్నలిస్టులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.



