మల్లాపూర్‌లో భీమ్ ఆర్మీ నాయకుల కొవ్వొత్తుల నివాళి
ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామానికి చెందిన దళిత యువతి సుస్మిత (24) మృతి ఘటనపై న్యాయం చేయాలని భీమ్ ఆర్మీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సుస్మిత చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు డిగ్రీ పూర్తి చేసిన సుస్మిత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ, మహబూబాబాద్‌లో ఎస్సై శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆమె వివాహం చేసుకోవాలని కోరగా, కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు అంగీకరించరనే కారణంతో వివాహ విషయాన్ని వాయిదా వేస్తూ వచ్చాడని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన సుస్మిత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. సుస్మిత మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ నాయకులు ప్రణీత్, గణేష్, వేణు, మనోహర్, అరుణ్, వంశీ, గౌతమ్, సన్నీ, అజ్జి, సిద్ధు, విక్కీ, అజయ్, విన్ను, అభిలాష్, చక్రి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.




