ప్రమాదకర చెట్ల తొలగింపులో ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం
ధర్మారం, (తెలంగాణ వాణి) రోడ్డుపక్కన ఉన్న చెట్టు కొమ్మ విరిగి ద్విచక్ర వాహనదారుడిపై పడటంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ధర్మారం మండల కేంద్రంలోని గోదావరి అర్బన్ బ్యాంక్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన మంతెన రాజు పని నిమిత్తం ధర్మారం వచ్చి తిరిగి స్కూటీపై ఎండపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతని ముందు భారీ లోడుతో లక్షెట్టిపేట వైపు వెళ్తున్న లారీకి రోడ్డుపక్కన ఉన్న దూరిశెను చెట్టు కొమ్మ తగిలింది. దీంతో భారీ కొమ్మ విరిగి వెనుకనే స్కూటీపై వస్తున్న రాజు నుదుటిపై పడటంతో తీవ్ర రక్తగాయమైంది. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని సమీపంలోని సంజీవని ఆసుపత్రికి తరలించారు. ధర్మారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించడంలో ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే స్పందించి రహదారికి ఆనుకొని ఉన్న ప్రమాదకర చెట్ల కొమ్మలను తొలగించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.




