ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యం
పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక చొరవ
నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
విద్య, వైద్యం, పర్యాటక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం
మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ (తెలంగాణవాణి ప్రతినిధి) ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులందరం సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి 26వ డివిజన్లో రూ.కోటి వ్యయంతో, 46వ డివిజన్లో పట్టణ మౌలిక సదుపాయాల నిధుల ద్వారా రూ.1.50 కోట్లతో చేపట్టనున్న బాక్స్ టైప్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 నుంచి 90 శాతం వరకు పనులు పూర్తయి వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా భీమదేవరపల్లి లో నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేసినట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. జమ్మికుంట, హుస్నాబాద్ ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధిత వర్గాలను కోరుతున్నామని పేర్కొన్నారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఫార్మసీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులకు ప్రాధాన్యత కల్పిస్తూ విద్యా అవకాశాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా అసంపూర్తిగా నిలిచిపోయిన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. విద్య, వైద్యం, పారిశ్రామిక పార్కులు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సింగరేణి, ఎన్టీపీసీ, గోదావరి జలసంపద వంటి వనరులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అభివృద్ధిలో అపార అవకాశాలను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాల అభివృద్ధితో పాటు ఎలగందుల ఖిల్లా, ఇతర పర్యాటక ప్రాంతాలు, జలవనరుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ నగరంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కోసం దాదాపు వెయ్యి కొత్త పోస్టుల భర్తీకి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.
కరీంనగర్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరినట్లు తెలిపారు. ప్రజలకు సంబంధించిన ఉమ్మడి సమస్యలను ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకువస్తే సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన పనులపై జర్నలిస్టులు కూడా నిర్మాణాత్మక సూచనలు చేస్తూ భాగస్వాములు కావాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని, ఉత్తర తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరి కుట్రలు : బండి సంజయ్ కుమార్
కరీంనగర్ నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తుంటే కొందరు లేని వివాదాలను సృష్టిస్తూ అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి అమృత్ పథకం కింద రూ.17 కోట్లు, యూసీఎఫ్ నిధుల కింద మరో రూ.80 కోట్లతో మొత్తం రూ.97 కోట్లతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో డంపింగ్ యార్డు సమస్యను పట్టించుకోలేదని, కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించకపోవడంతో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ప్రస్తుతం డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి టెండర్ ప్రక్రియ ప్రారంభించగా, కొందరు వివాదాలు సృష్టిస్తూ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తున్నాయని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏడాదిలోపు నగరంలోని అన్ని డివిజన్లలో గల్లీగల్లీలో అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా నగర అభివృద్ధికి సహకరించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేశాయ్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్పొరేటర్లు మల్లికార్జున్ రాజేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.





