అణగారిన వర్గాల గొంతుకగా విద్య నిలవాలి: ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు
వేములవాడలో ఘనంగా ఆర్వీకే రెండో వార్షికోత్సవం
రంగవల్లక్క 27 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి ఘన నివాళి.. ప్రజా ఉద్యమాల ఐక్యతకు నేతల పిలుపు
వేములవాడ, నవంబర్ 12 (తెలంగాణ వాణి):
ప్రశ్నించే గొంతుకలు బలపడినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, అన్యాయాలను ఎదిరించే చైతన్యాన్ని పెంపొందించడమే నిజమైన విద్యకు అసలైన అర్థమని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు అన్నారు. విద్య అనేది కేవలం అక్షర జ్ఞానానికో, పట్టాల సాధనకో పరిమితం కాకుండా సామాజిక అసమానతలను ప్రశ్నించే శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కామ్రేడ్ రంగవల్లి విజ్ఞాన కేంద్రం (ఆర్వీకే) రెండో వార్షికోత్సవం సందర్భంగా రంగవల్లక్క 27 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యలో శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధమైన ఆలోచన, సామాజిక బాధ్యత కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఆర్వీకే అధ్యక్షురాలు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అధ్యక్షత వహించారు.సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి తత్వవేత్తల ఆలోచనల్లో ప్రశ్నించడం, తర్కించడం, సమాజాన్ని విశ్లేషించడం ప్రధాన అంశాలుగా నిలిచాయని నాగేశ్వరరావు వివరించారు. భారతదేశ చరిత్రలో కుల ఆధారిత ఆంక్షల కారణంగా అణగారిన వర్గాలకు విద్యావకాశాలు దూరమయ్యాయని, ఈ పరిస్థితులను అధిగమించేందుకు సమాన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి విద్యావ్యవస్థలో ప్రజాస్వామిక విలువలు, శాస్త్రీయ ఆలోచనలకు పెద్దపీట వేయాలని సూచించారు. యువతలో పెరుగుతున్న ప్రశ్నించే తత్వం ప్రజాస్వామ్యానికి బలమని, ప్రపంచవ్యాప్తంగా యువతలో వ్యక్తమవుతున్న నూతన చైతన్యం సమాజ మార్పునకు దోహదపడుతుందని అన్నారు.
రంగవల్లక్క ఆశయాల సాధనే నిజమైన నివాళి: విమలక్క

రంగవల్లక్కతో తనకు ఉన్న సుదీర్ఘ ఉద్యమ అనుబంధాన్ని విమలక్క గుర్తుచేసుకున్నారు. ఆమెను స్మరించుకోవడం కేవలం జ్ఞాపకాలను నెమరువేసుకోవడం మాత్రమే కాదని, ఆమె ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజా సమస్యలపై పోరాటాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ప్రజల గొంతుకలను అణచివేసే ప్రయత్నాలను ప్రశ్నించాలని, అన్యాయాలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అమరుల ఆశయాల సాధన కోసం ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక శక్తులు, ప్రగతిశీల ఉద్యమకారులు భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.27 ఏళ్ల పోరాట ప్రస్థానం.. ఉద్యమ తరాలకు మార్గదర్శకం
సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల సాధన కోసం రంగవల్లక్క సాగించిన 27 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఆమె పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్య, వైద్యం, సామాజిక సమానత్వం, ప్రజాస్వామిక హక్కుల కోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ సంస్మరణ సభలో ఆర్వీకే సభ్యురాలు రాజేశ్వరి, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి, పీడీఎస్యూ (విజృంభణ) నాయకులు విజయ్, ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ వి. సంతోష్, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు లక్ష్మి, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడీ సుదర్శన్, స్వామిదాస్, శ్రీనివాస్, వాణి వొల్లాల, గొట్టె రుక్మిణి, మల్లారెడ్డి, అరుణోదయ రాకేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, బొల్లం లింగమూర్తి, బిజిగిరి నవీన్ కుమార్, జీఎస్ ఆనంద్, గొడిశాల రమేష్ గౌడ్, పోతుల రమేష్ తదితర ప్రజాసంఘాల నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు





