సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండి హద్దులు సరిచూసుకోవాలి
చామనపల్లి ముంపు గ్రామ తరలింపు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలి
అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ధర్మారం, జూలపల్లి (తెలంగాణ వాణి ప్రతినిధి): ప్రభుత్వ ప్రతిష్టాత్మక భూముల రీ సర్వే కార్యక్రమానికి రైతులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండి తమ భూముల హద్దులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు.
గురువారం ధర్మారం మండలం శాయంపేట, చామనపల్లి గ్రామాలతో పాటు జూలపల్లి మండలం కాచాపూర్‌లో పర్యటించిన కలెక్టర్ భూముల రీ సర్వే, సోషల్ ఎకనామిక్ సర్వే పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం జూలపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల రీ సర్వేకు ముందు రైతులకు ముందస్తు సమాచారం అందిస్తామని, సర్వే పూర్తయిన తర్వాత వివరాలను గ్రామంలో ప్రకటించి అభ్యంతరాల స్వీకరణకు తగిన గడువు కల్పిస్తామని తెలిపారు. రైతులు సర్వే సమయంలో అందుబాటులో లేకపోతే భవిష్యత్తులో జియో కోఆర్డినేట్ల ఆధారంగా జారీ చేసే పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. చామనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రతి కుటుంబ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చామనపల్లి ముంపు గ్రామ తరలింపు ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అనంతరం పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు అల్పాహారం సక్రమంగా అందేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ధర్మారం తహసీల్దార్ శ్రీనివాస్, జూలపల్లి తహసీల్దార్ దత్తు ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




