మద్యం పేరుతో తీసుకెళ్లి కత్తి, ఇటుకతో దాడి
మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్.. ఆయుధాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఆదినారాయణ
కొత్తగూడెం, అక్టోబర్ 28 (తెలంగాణ వాణి) పాత గొడవలు, వ్యక్తిగత కక్షలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. మద్యం తాగిస్తామని నమ్మించి తీసుకెళ్లి, కత్తి, సిమెంట్ ఇటుకలతో దాడి చేసి మేడి అఖిల్‌ను హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను లక్ష్మీదేవిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి కేసును ఛేదించిన పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలున్న దుస్తులు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన అఖిల్ హత్య కేసులో దంత్యాల గణేష్ అలియాస్ గని, సిరిపురం సాత్విక్ అలియాస్ చిన్సు, ముద్దంగుల వెంకటేష్ అలియాస్ చిన్ని, తరాల ప్రదీప్‌లను కొత్తగూడెం బస్‌స్టాండ్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు టెక్నికల్ టీమ్ సహకారంతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించినట్లు డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు.
మద్యం పేరుతో పిలిచి.. దారుణ హత్య
పోలీసుల విచారణ ప్రకారం.. గతంలో జరిగిన గొడవలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో గణేష్, సాత్విక్‌లు అఖిల్‌పై పగ పెంచుకొని హత్యకు పథకం రచించారు. ఇందులో భాగంగా మద్యం తాగిస్తామని నమ్మించి ఎదురుగడ్డ గ్రామంలోని రేకుల షెడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్టోబర్ 19 తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గణేష్ కత్తితో అఖిల్ మెడపై పలుమార్లు పొడిచి, సిమెంట్ ఇటుకతో ముఖంపై దాడి చేయగా, సాత్విక్ కూడా ఇటుకతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో అఖిల్ మృతి చెందినట్లు తెలిపారు.
ఫోన్‌పే లావాదేవీలతో కీలక ఆధారాలు
ఈ హత్యకు సంబంధించి మిగిలిన ఇద్దరు నిందితులు కూడా ముందస్తు పథకంలో భాగంగా సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మద్యం కొనుగోలు తదితర అవసరాల కోసం ఫోన్‌పే ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లు, లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలున్న దుస్తులను కూడా స్వాధీనం చేసుకొని, ఇతరుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు
పాత గొడవలు, వ్యక్తిగత కక్షలతో హింసకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. వివాదాలు తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. నిందితులు ఎంతకాలం పరారీలో ఉన్నా సాంకేతిక ఆధారాలతో గుర్తించి చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. కేసు ఛేదనలో టెక్నికల్ టీమ్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




