యథేచ్ఛగా విక్రయాలు.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు?
మామూళ్ల వసూళ్లపై ఆరోపణలు.. ఉన్నతాధికారులు స్పందించేనా?
ఇందల్వాయి (తెలంగాణ వాణి) ఇందల్వాయి మండలంలోని పలు గిరిజన తండాల్లో నాటుసారా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. మండలంలోని సుమారు 17 గిరిజన తండాల్లో ఇప్పపువ్వు సారా పేరుతో నల్లబెల్లంతో తయారు చేసిన నాటుసారాను విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లీటరు నాటుసారాను రూ.200కు విక్రయిస్తున్నారని, కొన్ని తండాల్లో పదుల సంఖ్యలో విక్రయ కేంద్రాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నాటుసారా తయారీ, విక్రయాలపై సంబంధిత అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని, నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ కానిస్టేబుల్ ద్వారా ఈ వసూళ్లు జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. అక్రమ మద్యం విక్రయాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు అక్రమ మత్తు పదార్థాల నియంత్రణకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని మండల ప్రజలు అంటున్నారు. జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఇందల్వాయి మండలంలోని గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించి, నాటుసారా తయారీ కేంద్రాలు, విక్రయ స్థావరాలపై తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారితో పాటు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




