UPDATES  

 ఢిల్లీ సీఎంగా అతిషి

తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్)

రాజధాని ఢిల్లీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న సందేహం కలిగింది. ఈ క్రమంలో అతిషీ, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్లు వినిపించాయి. చివరకు మంత్రి అతిషీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేందుకు ఆమోదం తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు. మంగళవారం చేపట్టిన పార్టీ సమావేశంలో ఆప్ నేత దిలీప్ పాండే తదుపరి శాసనాసభ పక్ష నేత, సీఎం పేరును ప్రతిపాదించాలని కేజ్రీవాల్‌ను కోరారు. ఆప్ జాతీయ కన్వీనర్ అతిషీ పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు.

 

మంగళవారం మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అనంతరం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీ సీఎంగా అతిషీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అతిషీ అసలు పేరు అతిషీ మార్లేనా సింగ్. మార్లేనా అనేది కమ్యూనిజం భావాజాలంతో మార్క్స్ అండ్ లెనిన్ పేరును కలుపుతూ ఆమెకు నామకరణం చేశారు పేరెంట్స్. 1981లో ఢిల్లీలో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో జన్మించింది. ఆమె తండ్రి విజయ్ సింగ్, త్రిప్తా వాహి ఇద్దరు ఢిల్లీ యూనివర్శిటీ ఫ్రొఫెసర్స్. ఆమె విద్యాభ్యాసం అంతా ఎక్కువగా ఢిల్లీలోనే సాగింది. స్పింగ్ డేల్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసిన అతిషీ.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.

 

ఆమె పర్వీన్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆతిశి ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్‌లో కొన్నాళ్లపాటు పిల్లలకు పాఠాలు కూడా చెప్పారు. ఆ తర్వాత ఆమె మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో ఏడు సంవత్సరాలు గడిపారు. అక్కడ ఆమె సేంద్రీయ వ్యవసాయం, ప్రగతిశీల విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించారు. అవినీతికి పోరాటంగా ఆప్ చేసిన ఉద్యమానికి మద్దతు తెలిపారు. అలా ఆప్‌తో ఆమె ప్రయాణం మొదలైంది. 2018 వరకు మాజీ విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా పనిచేశారు. ఆ సమయంలో, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ‘హ్యాపీనెస్ కరికులం’, ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్‌సెట్ కరికులమ్’ తీసుకు వచ్చారు. విద్యార్థుల మానసిక శ్రేయస్సు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించింది. ఆమె పనితీరు మెచ్చి.. 2019లో సార్వత్రిక ఎన్నికల కోసం తూర్పు ఢిల్లీ లోక్ సభ ఇన్ చార్జీగా బాధ్యతలు అప్పగించింది అధిష్టానం.

 

అతిషీ 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. 11,422 ఓట్లతో మెజార్టీతో బీజెపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్‌ను ఓడించారు. ఇక అక్కడ నుండి తన గళాన్ని మరింత గట్టిగా వినిపించడం స్టార్ట్ చేశారు అతిషీ. గతేడాది మార్చి 9న ఢిల్లీ కేబినెట్‌లో ఆమెకు చోటు దక్కింది. విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, నీరు, విద్యుత్, ప్రజా సంబంధాలు వంటి కీలక పదవులు అప్పగించారు. అవినీతి, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా చేయడంతో ఆ పదవులు కూడా ఆమెకు దక్కాయి. 14 శాఖలను తన భుజాలపై వేసుకుని మోశారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ముందుండి నేతలను, కార్యకర్తలను నడిపించారు. ఇదే ఆమెపై నమ్మకం కలిగేలా చేసి.. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి అప్పగించేలా చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest