UPDATES  

 మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది “ఎర్రజెండా” నే

నిజాంకు వణుకు పుట్టించిన చర్రిత తెలంగాణ ప్రజలది
సాయుధ పోరాట చరిత్ర దేశానికి దిక్చూచి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా
సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా సాయుధపోరాట దినోత్సవం

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది కమ్యూనిస్టుల ఎర్రజెండానేనని, కమ్యూనిస్టులతో మమేకమై నాటి మట్టిమనుషులు సాగించిన విరోచిన పోరాట ఫలితమే నేటి ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. 76వ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్’లో జాతీయ జెండాను ఎగురవేసి సాయుధ పోరాట అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులు సాబీర్ పాషా మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం నేటికీ ప్రజలకు స్పూర్తినిస్తోందని, దున్నేవాడికే భూమి నినాదం దేశవ్యప్తం చేసిందని కొనియాడారు. మహత్తరమైన, త్యాగపూరితమైన సాయుధ పోరాటాన్ని మతపోరాటంగా చిత్రీకరిస్తూ నేటి ఆర్ఎస్ఎస్ వారసులుగా ఉన్న బీజెపీ లబ్దిపొందే కుట్ర చేస్తోందని విమర్శించారు. తెలంగాణ విలీనంకోసం జరిగిన నాటి సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్రంకోసం జరిగిన తొలిదశ, మలిదశ విరోచిత పోరాటంలో విజయాలు సాధించిన తెలంగాణ గడ్డపై మతోన్మాదుల అటలు సాగవన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చను పొందడంకోసం ఆనాటి యావత్ సమాజం కమ్యూనిస్టు యోధులు రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మక్కం మోహియుద్దీన్, బొమ్మగాని ధర్మభిక్షం, చాకలి ఐలమ్మ వంటి వారి నేతృత్వంలో ఉద్యమించిన తీరు ప్రతిఒక్కరికి స్పూర్తి అని అన్నారు. తెలంగాణ విముక్తి పోరాటం ప్రపంచ ప్రజా ఉద్యమాలకు ఆదర్శమన్నారు. రజాకారుల రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేందుకు వందల ఏండ్ల చరిత్ర ఉన్న నిజాం రాజును గద్దె దింపిందని, నిజాం స్వాదీనంలో ఉన్న తెలంగాణా భూ భాగాన్ని భారతదేశంలో అంతర్భాగం చేసింది కమ్యూనిస్టుల ఉద్యమేనన్నారు. ఆ మహత్తర పోరాటంలో 4500మంది యువ కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని, వారి ప్రాణత్యాగ ఫలితంగానే పది వేల గ్రామాలను విముక్తి లభించిందని అన్నారు. పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేశారని, ఇంత పెద్ద మొత్తంలో భూమిని పంచిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదని, నాడు రైతాంగి పోరాటంలో పంచిన భూముల్లో నేటి పాలకులు మూడో వంతు కూడా పంచలేదని విమర్శించారు. నాటి సాయుధపోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజాపోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కె. రాజ్కుమార్, కె. సారయ్య, జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, దమ్మాలపాటి శేషయ్య, వాసిరెడ్డి మురళి, వట్టికొండ మల్లికార్జున్రావు, భూక్య శ్రీనివాస్, రత్నకుమారి, ధనలక్ష్మి, ధర్మరాజు, యూసుఫ్, మాచర్ల శ్రీనివాస్, మాతంగి టింగయ్య, లక్ష్మినారాయణ, షాహీన్, విజయలక్ష్మి, దార లక్ష్మి, నేరెళ్ళ రమేష్, మిర్యాల రాము, లింగేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest