కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి): వినాయక చవితిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ, మత సామరస్యాన్ని చాటుతూ ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకుల చేతుల మీదుగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల మురళి మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాల వినియోగంతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు మత సామరస్యం, సమైక్యతను చాటాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, జలవనరుల కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెదబాబు, ఉపాధ్యక్షుడు మంద హనుమంతు, కోశాధికారి కోదుమూరి శ్రీనివాసరావు, పరమేష్ యాదవ్, కార్పొరేటర్లు జయతి మసూద్, శ్రీలక్ష్మి, దావూద్, జాని, కమర్, అన్వర్, ఇమ్రాన్, గోరెబాబు, సత్తిరెడ్డి, బాల, హరి, ఏనుగుల వెంగళరావు, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




