హైదరాబాద్, అక్టోబర్ 5 (తెలంగాణ వాణి) జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా జరిగే రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో సమాచార శాఖలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారిని చక్రం తిప్పడం, ఈ విషయంలో చైర్మన్ ఆమెకు అనుకూలంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు ఆస్కాని మారుతి సాగర్ అవేదన వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో సభ్యుల అభిప్రాయాల కంటే సమాచార శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న యామిని అనే అధికారికి ప్రాధాన్యతను ఇస్తూ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని, వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తాను సమావేశాన్ని బహిష్కరించి బయటికి వచ్చినట్లు ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టుల విషయంలో కూడా ఫ్రీ లాన్స్ కార్డులు ఇచ్చే విషయంలో వంద కండీషన్ లు పెడుతూ సదరు అధికారి సిఫారస్ చేసిన వారికి మాత్రం చైర్మన్ వెంటనే ఆమోదం తెలిపి కమిటీ సభ్యుల మనోభావాలను సమావేశంలోనే కించపరుస్తున్నారని అన్నారు. కమిటీలో సభ్యుల అభిప్రాయం మేరకు అర్హులైన జర్నలిస్టులకు కార్డులు అందించాల్సి ఉండగా ఒక అధికారిని మాటనే వేదవాక్కుగా తీసుకోవడం పట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే తీరు కనబరిస్తే తప్పనిసరిగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.




