కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి): కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక విఘ్నేశ్వర పూజలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
భక్తులకు విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన స్వామివారికి ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ ప్రత్యేక అలంకరణలు చేయనున్నారు. నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలతో పాటు గణపతి హోమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ నెల 18వ తేదీన స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. 21వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు స్వామివారి రథోత్సవాన్ని పురవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.
25వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం స్టేడియంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అనంతరం నిమజ్జనం నిమిత్తం భద్రాచలం వద్ద గోదావరి నదికి తరలించనున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.





