భద్రాచలం మే 10:మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతతో కూడిన ఆధునిక పద్ధతులను అవలంబించి గిరిజనాభివృద్ధి కోసం నాణ్యతతో కూడిన మెరుగైన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తామని గిరిజన శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాణ్యత పరమైన నిర్మాణ పనుల్లో ఎలాంటి రాజీ లేకుండా సేవలు అందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇంజనీర్ల కొరత ఉన్న నేపథ్యంలో టెండర్ ప్రక్రియ ద్వారా పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు తప్పనిసరిగా సైట్ ఇంజనీర్లను నియమించుకుని పనుల పర్యవేక్షణతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆదేశించారు.ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, భద్రాద్రి జిల్లా ఎస్పీ, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ఐఏఎస్ ఆదేశాల మేరకు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రారంభం కాని పనుల అగ్రిమెంట్లను రద్దు చేసి, కొత్త టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించినట్లు చెప్పారు.భద్రాచలం ఐటిడిఏ పరిధిలో గిరిజన కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అగ్రిమెంట్ అయిన ప్రతి పనిని క్షేత్రస్థాయిలో సందర్శించి, నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ ఆదేశించారు.

