అదుపులోకి తీసుకున్న అధికారులు
కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రాధిక అక్రమ కమిషన్లు వసూలు చేసిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న 44 ఏళ్ల మహిళా ఉద్యోగిని రాధికను మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేస్తానంటూ ఆమె తన అధికార హోదాను దుర్వినియోగం చేసి అక్రమ కమిషన్లు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇందుకోసం బినామీ ఖాతాలను ఉపయోగించడంతో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఐసీడీఎస్ కు గుడ్లు, పప్పులు, ఇతర సరుకులు సరఫరా చేసే సరఫరాదారుల నుంచి లంచాలు డిమాండ్ చేసి, వాటిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కుటుంబసభ్యుల ఖాతాల ద్వారా యూపీఐ లావాదేవీల రూపంలో స్వీకరించినట్లు ఏసీబీ గుర్తించింది. జూన్ 2022 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఆమెకు అక్రమంగా రూ.2.37 లక్షలకుపైగా ప్రయోజనం చేకూరినట్లు అధికారులు పేర్కొన్నారు. విధులను నిజాయితీగా నిర్వర్తించకుండా అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నిం చినందుకు ఆమెను అరెస్టు చేసి కరీంనగర్ లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజాసేవకులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపింది.


