కోట్లు నొక్కేసి కుంటి సాకులు చెబుతున్నారంటు బాధితుల ఆవేదన
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ఆన్లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఉద్యోగులు.. ఆన్లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. నిరుద్యోగులు, యువతే టార్గెట్ గా కొందరు కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఖాళీ సమయంలో పార్ట్ టైంగా ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేయండి, భారీగా సంపాదించే అవకాశం ఉంది అంటూ మాయగాళ్లు పెద్ద ఎత్తున యువత నుంచి అందిన మేరకు దోచుకొంటున్నారు. ఇలాంటి కేసులు నగరంలో ఇటీవల ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఆ ప్రకటనలు నమ్మి పలువురు ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు, మోసగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. ఇదే తరహాలో మా యాప్ ద్వారా యూట్యూబ్ వీడియోలు చూసి లక్షలు సంపాదించండి అంటూ తెలుగు రాష్ట్ర ప్రజలను ఊబిలోకి దింపింది IAS ఇండియన్ అడ్వర్టిజింగ్ సర్వీస్ అనే ఓ సంస్థ… ఒక్కో టారీఫ్ ప్లాన్ కు ఒక్కో రకంగా సంపాదన ఎరగా వేసింది. మేం ఇలాగే మొబైల్ లో యూట్యూబ్ లో యాడ్స్ చూస్తు డబ్బులు సంపాదిస్తున్నాం మీరు చేరండని కొందరి ద్వారా ప్రలోభాలకు గురి చేసి ముగ్గులోకి దింపడం నమ్మకం కలిగేలా 3 నెలలు డబ్బులు ఇచ్చి మీరు పది మందిని జాయిన్ చేస్తే అదనంగా మీమ్మల్ని ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకోని మీకు జీతం ఇస్తాం అంటూ మరో ఎర వేసింది. ఇంకేముంది మాకు డబ్బులు వస్తున్నాయ్ ఇదిగో సాక్ష్యం అంటూ గతంలో ఈ IAS ద్వారా డబ్బులు సంపాదించిన వారి మాటలకు తోడు ఫోన్ లో వీడియోలు చూస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చని ఆశించి ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టిన వారు గణేష్ నిమజ్జనం సందర్బంగా వినాయకుడితో పాటుగా నిండా మునిగిపోయారు. యూట్యూబ్లో వీడియోలకు లైక్ చేస్తే చాలని, అన్నింటికి లెక్కకట్టి డబ్బులు వేస్తామని చెప్పిన ఈ కంపెనీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు 8 కోట్లు డిపాజిట్ లు సేకరించినట్టు ప్రాధమిక సమాచారం. అయితే ఈ IAS యాప్ ద్వారా తమిళనాడు తర్వాత అత్యధికంగా మన తెలుగు వాళ్లే బలయినట్టు తెలుస్తుంది. ఇంటి పట్టునే ఉండి సంపాదించుకోవచ్చనే ఇలాంటి బురిడీ స్కీమ్ లను నమ్మి ప్రజలు మోసపోతూనే ఉన్నారు.
ఫిర్యాదుల వెల్లువ
కాగా తమకు తెలిసిన వారు చెప్పిన మాటలు నమ్మి స్కీమ్ లో చేరామని మొదట్లో డబ్బులు బాగా వచ్చాయని ఈ మధ్య కొత్తగ 10వేలు కడితే 3 నెలల్లో 2 లక్షలు వస్తాయని చెప్పడంతో 10/-, 20/- వడ్డీకి తెచ్చి ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు డబ్బులు విత్డ్రా కావడం లేదని, ఇదేంటని అడిగితె టెక్నీకల్ ఇస్యు ఉందని ఆది క్లియర్ కావాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలని అంటున్నారని బాధితులు తమను ఈ స్కీమ్ లో చేర్చిన వారిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
జమ్ము కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు లక్షలాది మంది సభ్యులను చేర్చుకున్న ఈ IAS కంపెనీ మన తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లకు పైగా వెనకేసుకుని బోర్డు తిప్పేసిందనే ప్రచారం నడుస్తుంది.