UPDATES  

 టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి లను అరెస్టు చేయాలి : గాయత్రి బెహరా

గుంటూరు (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

స్థానిక అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి లపై ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్బంగా సొసైటీ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు గాయత్రి బెహరా మాట్లాడుతూ తిరుమల తిరుపతి క్షేత్రానికి ప్రపంచంలోనే విశిష్ట గుర్తింపు ఉందని, తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమని అలాంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన తిరుపతి లడ్డు హిందువులకు అత్యంత పవిత్రమైనదని అలాంటి తిరుపతి లడ్డుకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె అవశేషాలు ఉండడం చాలా బాధాకరమన్నారు. ఈ విషయం కోట్లాది హిందువుల మనోభావాలు మరియు మత విశ్వాసాలను దెబ్బతీసే విషయమని దీనికి బాధ్యులుగా అప్పటి టీటీడీ చైర్మన్, ఈవో లను వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపి దీని వెనక ఎవరున్నారు, వీరి కుట్ర ఏమిటో ప్రభుత్వం బయట పెట్టాలని అలాగే మిగిలిన పెద్ద దేవాలయాలైన శ్రీశైలం, సింహాచలం, అన్నవరం మొదలగు పెద్ద దేవాలయాల్లోని ప్రసాదాలకు వాడుతున్న నెయ్యిని కూడా ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేయాలని పేర్కొన్నారు.

మొదటినుండి జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణి అవలంబించడం వల్లనే నేడు ఘోర పరాభవం చవి చూడాల్సి వచ్చిందని దేవాలయాల మీద దాడులు చేసి విగ్రహాలు ధ్వంసం చేస్తే రధాలు తగలబెడితే పెట్టిన వారిని పట్టుకుని శిక్షించాల్సింది పోయి వాటి మీద ఉద్యమం చేసిన హిందూ నాయకులను జైల్లోకి పంపించిన ఘన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెల్లుతుందని అలాగే ఆయన ప్రభుత్వంలో ఇంత దారుణం టిటిడిలో జరిగిందని వెలికి తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో సరిపెట్టకుండా దీని మీద నిజనిర్ధారణ కమిటీ వేయాలని దానిలో స్వామీజీలు హిందూ సంఘాలను సభ్యులను చేయాలని దాని ద్వారా విచారణ సవ్యంగా జరుగుతుందని వారు చేసిన దారుణాలు బయటకు వస్తాయని అలాగే ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే రాజకీయ నాయకులు ఒక విషయం గుర్తుంచుకోవాలని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి జోలికి వచ్చిన వారికి ఏ గతులు పెట్టాయో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు అనిల్ బెహరా, చింతపల్లి మల్లికార్జున్ శర్మ, భిక్షవాచారి పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest