పోషణ మాసంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు
దేవరకొండ, అక్టోబర్ 5 (తెలంగాణ వాణి ప్రతినిధి) దేవరకొండ మండలం పడమటిపల్లి, ఎల్లారెడ్డిబాయి, తూర్పుపల్లి, వైదోని వంపు గ్రామాల్లో పోషణ మాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్. రాధ పాల్గొని గర్భిణులు, బాలింతలు, తల్లులకు పోషకాహార విలువలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాధ సూచించారు. తక్కువ ఖర్చుతో స్థానికంగా లభించే ఆహార పదార్థాలతోనే శరీరానికి అవసరమైన పోషకాలు పొందవచ్చన్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి తృణధాన్యాలతో పాటు ఆకుకూరలు, తాజా కూరగాయలు, పల్లీలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు కిన్నెర సువర్ణ, జి. పరిమళ, బి. ప్రమీల, వి. నీలమణి, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.




