UPDATES  

 ఖమ్మం గుమ్మంలో దొంగల హల్చల్

సినీ ఫక్కిలో సోనోవిజన్ షోరూమ్ ను గుల్ల చేసిన దొంగల ముఠా 

పోలీసులు వచ్చేలోపు కారులో పరారు 

ఖమ్మం (తెలంగాణ వాణి) ఖమ్మం నగరంలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. జడ్పీ సెంటర్‌లో ఉన్న సోనోవిజన్ మొబైల్ స్టోర్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తెల్లవారుఝామున భారీ దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ.80 లక్షల విలువైన ఖరీదైన సెల్‌ఫోన్లను అపహరించి పరారైనట్లు తెలుస్తుంది. దొంగలు స్టోర్‌లోకి ప్రవేశించిన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల అలారం మోగడంతో అప్రమత్తమైన విజయవాడలోని సంస్థ సిబ్బంది ఖమ్మంలోని సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే దుండగులు తమ పని పూర్తి చేసుకుని కారులో అక్కడి నుంచి పారిపోవడానికి సిద్ధమయ్యారు. దుండగులను అడ్డుకునేందుకు సోనోవిజన్ సిబ్బంది తమ వాహనాన్ని కారుకు అడ్డంగా పెట్టినప్పటికీ, ఫలితం లేకపోయిందని, కాగా ఈ ఘటన మొత్తం సినీ ఫక్కీలో జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీ వెనుక అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొన్న కరీంనగర్ లో బంగారు నగల షోరూం, నేడు ఖమ్మంలో సోనోవిజన్ షోరూం లలో జరిగిన భారీ దొంగతనాలను చూస్తుంటే అంతరాష్ట్ర దొంగల కన్ను తెలంగాణపై పడిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest