కమలాపూర్‌లో తెలంగాణ వాణి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు
యువత డ్రగ్స్ కి బానిస కావద్దు – సీ.ఐ. నవీన్ యాదవ్
డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయి – ఎడిటర్ జెరిపోతుల సంపత్
యువత భవిష్యత్ కి పునాదులు వెయ్యాలి – ఎస్ఐ మధు
మత్తు వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి – సైకాలజిస్ట్ బైరి నరేష్

కమలాపూర్, జూలై 24 (తెలంగాణ వాణి) :
సమాజాన్ని నిశ్శబ్దంగా కబళిస్తున్న ముప్పు ఏదైనా ఉందంటే అది డ్రగ్స్ వ్యసనమే. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న మాదకద్రవ్యాల సంస్కృతి వారి చదువు, ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో యువతలో చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ వాణి దినపత్రిక ఆధ్వర్యంలో కమలాపూర్‌లో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సు సమాజానికి విలువైన సందేశాన్ని అందించింది.సదస్సులో పాల్గొన్న కమలాపూర్ సీఐ నవీన్ యాదవ్ మాట్లాడుతూ, డ్రగ్స్‌కు బానిసైతే జీవితమే అంధకారమవుతుందని, యువత చెడు స్నేహాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.ఎస్ఐ మధు మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తాయని, విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగి తమ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని అన్నారు.

ప్రముఖ సైకాలజిస్ట్ బైరి నరేష్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలు వ్యక్తి ఆలోచనా విధానాన్ని, కుటుంబ సంబంధాలను, సామాజిక జీవనాన్ని నాశనం చేస్తాయని చెప్పారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, విజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ వాణి ఎడిటర్ జెరిపోతుల సంపత్ మాట్లాడుతూ, డ్రగ్స్‌కు ఎంత దూరంగా ఉంటే సమాజం అంత ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలన్న ఆయన డ్రగ్స్‌పై పోరాటం అనేది సమాజం బాధ్యత అని డ్రగ్స్ సమస్యను కేవలం పోలీసు శాఖ లేదా ప్రభుత్వంతోనే అరికట్టడం సాధ్యం కాదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, యువత కలిసి పనిచేస్తేనే మాదకద్రవ్యాల రహిత సమాజం నిర్మించవచ్చని, యువత కలలను కాపాడాలంటే డ్రగ్స్‌కు “నో” చెప్పడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.సీఓ శేషాద్రి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలు బాగుపడాలంటే డ్రగ్స్ కి దూరంగా ఉండాలన్నారు. కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో ఎలాంటి డ్రగ్స్ రాకుండా చూస్తామని అలాగే ఎవ్వరు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కమలాపూర్ ఎంపీడిఓ గుండె బాబు, కమలాపూర్ డిప్యూటీ ఎంఆర్ఓ సత్యనారాయణ, ఆర్ఐ సమ్మయ్య, కమలాపూర్ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు కౌడగాని రాజేష్, టీయుడబ్ల్యూజేయు ( హెచ్- 143 ) అధ్యక్షులు సతీష్, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలసాని దేవేందర్, మూడ నమ్మకాల నిర్ములన సంఘం జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత, తెలంగాణ వాణి దినపత్రిక రిపోర్టర్ మోటె చిరంజీవి,మామునూరి సంపత్,అయిలయ్య,సాంబమూర్తి, కుమారస్వామీ, రామకృష్ణ,నగేష్, వంశీక్రిష్ణ, శంకర్,తదితరులు పాల్గొన్నారు.






