వాహనాల విడుదలకు రూ.లక్ష అదనంగా డిమాండ్ చేశారన్న ఆరోపణలు
తిమ్మాపూర్, అక్టోబరు 8 (తెలంగాణ వాణి ప్రతినిధి):
మొరం అక్రమ తవ్వకాల కేసులో పట్టుబడిన జేసీబీ, మూడు ట్రాక్టర్లను విడుదల చేసేందుకు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలు పోలీసు శాఖలో కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ అనంతరం తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎల్‌ఎండీ ఎస్సై అన్వర్, కానిస్టేబుల్ అజీజ్‌లను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
తిమ్మాపూర్‌కు చెందిన నగునూరి బాబు జేసీబీ, మూడు ట్రాక్టర్లను విడుదల చేసేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఇందులో రూ.30 వేలు నగదుగా ఇచ్చామని, మరో రూ.20 వేలను తిమ్మాపూర్‌లోని ఓ వైన్స్ నిర్వాహకుడికి ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు తెలిపారు.
అనంతరం ప్రభుత్వానికి రూ.25 వేల జరిమానా చెల్లించి తహసీల్దార్ నుంచి వాహనాల విడుదల ఉత్తర్వులు పొందినట్లు పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులతో ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా, మరో రూ.లక్ష ఇవ్వాలని, లేదంటే కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతామని అధికారులు బెదిరించినట్లు బాబు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై వచ్చిన కథనాల నేపథ్యంలో సీపీ గౌస్ ఆలం ఆదేశాలతో అడ్మిన్ డీసీపీ పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. తొలుత ముగ్గురు పోలీసు అధికారులను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయగా, తాజాగా విచారణ నివేదిక ఆధారంగా ఐజీ సస్పెన్షన్ వేటు వేయడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది.




