తిమ్మాపూర్, నవంబర్ 21 (తెలంగాణ వాణి ప్రతినిధి): లోయర్ మానేరు జలాశయంలో మట్టి తవ్వకాలతో ఏర్పడిన లోతైన గుంతలు ప్రాణాలు తీస్తున్నాయి. జలాశయంలో ఈతకు దిగిన ఓ ఇంటర్ విద్యార్థి నీట మునిగి మృత్యువాత పడ్డాడు. కరీంనగర్‌కు చెందిన ఏడుగురు స్నేహితులు సరదాగా జలాశయానికి రాగా ఈ విషాదం చోటుచేసుకుంది. మట్టి తవ్వకాలతో ఏర్పడిన లోతైన గుంతలే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కరీంనగర్‌కు చెందిన సందరగి ఆర్యన్ (20) ట్రినిటీ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఏడుగురు స్నేహితులతో కలిసి లోయర్ మానేరు జలాశయం వద్దకు వచ్చాడు. వారంతా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగగా.. ఈత రాని ఆర్యన్ లోతైన ప్రాంతంలోకి వెళ్లి నీట మునిగిపోయాడు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని మత్స్యకారుల సహాయంతో గాలింపు చేపట్టారు. విద్యార్థిని బయటకు తీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గత కొంతకాలంగా దిగువ మానేరు జలాశయంలో భారీగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో పలుచోట్ల లోతైన గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల జలాశయంలోకి నీరు చేరడంతో ఆ గుంతలు కనిపించకుండా పోయి ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.జలాశయం కట్టపైకి సందర్శకులు వెళ్లకుండా పూర్తిస్థాయిలో భారీకేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటిలో ఎవరు దిగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రాణనష్టం జరగకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.





