ట్రాన్స్జెండర్లకు వేములవాడ పోలీసుల హెచ్చరిక
వారి సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: డీఎస్పీ శ్రీనివాసులు
వేములవాడ, నవంబర్ 14 (తెలంగాణ వాణి):
ప్రజలకు, భక్తులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శనివారం వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు ఇతర దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని సూచించారు. శాపనార్థాలు పెట్టడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, శుభకార్యాల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలపై ఫిర్యాదులు అందితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 
ట్రాన్స్ జెండర్ల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వారి గౌరవానికి భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తించినా, వేధించినా, దూషించినా లేదా ఉపాధి, సంక్షేమానికి సంబంధించిన సమస్యలు ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా తమ సమస్యలను తెలియజేసి న్యాయం పొందవచ్చని వివరించారు.
ట్రాన్స్జెండర్లను ఎవరైనా వేధించినా, అవమానించినా లేదా వారి హక్కులకు భంగం కలిగించినా ట్రాన్స్జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్, 2019 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




