తిమ్మాపూర్, నవంబర్ 27 (తెలంగాణ వాణి ప్రతినిధి):తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బస్సు ఢీకొట్టడంతో ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని పలువురు ప్రయాణికులు కూడా గాయపడినట్లు సమాచారం.స్థానికుల కథనం ప్రకారం.. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులోని బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కాలు విరిగిపోయింది. ట్రాక్టర్లో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న కొందరికి కూడా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తిమ్మాపూర్ సిఐ అనిల్, ఎస్సై అరుణ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.





