వేములవాడ,నవంబర్ 24 (తెలంగాణ వాణి ప్రతినిధి) :భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా వేములవాడకు చెందిన రేగుల శ్రీకాంత్ నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి, నిబద్ధతను గుర్తించి నాయకత్వం ఈ బాధ్యత అప్పగించింది. వేములవాడలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీకాంత్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు. దుబాయ్‌లో సీనియర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆయన, అనంతరం సమాజ సేవ, రాజకీయ రంగంపై ఆసక్తితో ముందుకు సాగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కీలకంగా వ్యవహరించడంతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లో తన తల్లిని కౌన్సిలర్‌గా గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ నియోజకవర్గవ్యాప్తంగా కార్యకర్తలతో మమేకమవుతూ వస్తున్నారు. వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం కలిగిన శ్రీకాంత్‌కు అధికార ప్రతినిధి పదవి దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతలతో ఆయన జిల్లా, నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.





