హైదరాబాద్ (తెలంగాణ వాణి)
నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగి వచ్చారు. ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్‌లోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో డ్రాగన్ క్యాప్సూల్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చేశారు. దాదాపు 9 నెలల తర్వాత నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ భూమి గురుత్వాకర్షణను మొదటిసారిగా అనుభవించారు. భూమిపై గాలిని పీలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్ నుంచి మెక్సికో గల్ఫ్‌లోకి పారాచూట్ ద్వారా ల్యాండ్ అయింది. స్ప్లాష్ డౌన్ తరువాత భద్రతా బృందం క్రాఫ్ట్‌ను రికవరీ షిప్‌లోకి ఎత్తి హాచ్ తెరిచింది. వ్యోమగాములకు సహాయక బృందాలు సాయం చేశాయి. డ్రాగన్ క్యాప్సూల్ నుంచి వ్యోమగాముల బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సునీత విలియమ్స్ భూమి గురుత్వాకర్షణను మొదటిసారిగా ఫీలయ్యారు. బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారం రోజుల పాటు ఉండాలనుకున్నారు. కానీ, అనుహ్యంగా తొమ్మిది నెలలకు పైగా అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత నాసా వ్యోమగాములు వీరిద్దరూ భూమికి తిరిగి వచ్చారు. రిటైర్డ్ యూఎస్ నేవీ టెస్ట్ పైలట్లు అయిన ఇద్దరూ విలియమ్స్ విల్మోర్, తమ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకను మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి ఎక్కారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కక్ష్యలో నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత భూమికి తిరిగి 17 గంటల ప్రయాణాన్ని ప్రారంభించారు. నాసా క్రూ-9 వ్యోమగామి మిషన్‌లో భాగమైన నలుగురు సభ్యుల సిబ్బంది తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించారు. ఆ వెంటనే రెండు సెట్ల పారాచూట్‌లు తెరుచుకున్నాయి. అంతరిక్ష నౌక కక్ష్య వేగాన్ని గంటకు దాదాపు 27,359 కిలోమీటర్లకు తగ్గించి తెల్లవారుజామున 3.30 గంటలకు స్ప్లాష్‌డౌన్ సమయానికి గంటకు 17 మైళ్లకు తగ్గించింది. డ్రాగన్ క్యాప్సూల్‌ను నీటి నుంచి బయటకు తీసి రికవరీ బోట్‌లోకి సహాయక సిబ్బంది తరలించారు. ఆ తర్వాత వ్యోమగాములను నాసా విమానంలో హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని వారి సిబ్బంది క్వార్టర్స్‌కు తీసుకెళ్తారు. నాసా వ్యోమగాములు తిరిగి ఇంటికి వెళ్లడానికి ముందు అనేక రోజుల పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. మొదట్లో 8 రోజులు మాత్రమే అంతరిక్షంలో ఉంటారని భావించిన వ్యోమగాములు.. స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. చివరికి నాసా స్టార్‌లైనర్‌ను ఖాళీగా తిరిగి పంపించింది. టెస్టర్ పైలట్‌లను స్పేస్‌ఎక్స్‌కు బదిలీ చేసింది. ఫిబ్రవరిలో రావాల్సి ఉండగా ఆలస్యం అయింది. స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌తో మరిన్ని సమస్యలతో మరో నెల అక్కడే ఉండాల్సి వచ్చింది. ఫలితంగా, విల్మోర్, విలియమ్స్ 286 రోజులు అంతరిక్షంలో గడిపారు. అనుకున్న దానికంటే 278 రోజులు ఎక్కువ. భూమి చుట్టూ 4,576 సార్లు పరిభ్రమించి 195 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు.