జిల్లా పరిధిలోని పాఠశాలలు, కళాశాలలో జిల్లా పోలీస్ అవగాహనా కార్యమాలు
కొత్తగూడెం (తెలంగాణ ప్రతినిధి)
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలోని పాఠశాలలు కళాశాలలలో విద్యార్థిని, విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన వాటిల్లే నష్టాల గురించి స్థానిక పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చాలామంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, మత్తు వలన విచక్షణ కోల్పోయి ప్రమాదాలకు గురవ్వడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం చేస్తున్నారని, అలాంటివారిలో మార్పు తీసుకురావడానికి పోలీస్ శాఖ తరపున అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించడం ద్వారా యువత భవిష్యత్తు నాశనం కాకూడదనే సదుద్వేశంతో పోలీస్ శాఖ తరపున ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. అదే విధంగా పాఠశాలలు, కళాశాలలో ర్యాగింగ్ వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని స్కూళ్లు, కళాశాలలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా, వినియోగించడం లాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ దిశగా పటిష్టమైన ప్రణాళికతో జిల్లాలోని పోలీసు అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ప్రజలను కోరారు.