UPDATES  

 కరీంనగర్‌లో ఉద్రిక్తత

బిజెపి వర్సెస్ బిఆర్ఎస్ 

గంగుల క్యాంప్ ఆఫీసుపై బీజేపీ శ్రేణుల దాడి..! 

కౌశిక్‌ రెడ్డి కారు ధ్వంసం

పోలీసుల తీరుపై మండిపడ్డ వద్దిరాజు రవిచంద్ర

 

కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్‌పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన కామెంట్స్ ను ఖండిస్తూ…. బీఆర్ఎస్ నేతలు కూడా సవాళ్లు విసిరారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను బీజేపీ కార్యకర్తలు సీరియస్ గా తీసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ… గంగుల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారు. ఈ ఘటనలో కౌశిక్ రెడ్డి కారు ధ్వంసమైంది.

 

 

అసలేం జరిగింది

 

ఈ గొడవకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశమే ప్రధాన కారణమైంది. గంగుల క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి….. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. “బండి సంజయ్ తంబాకుతో పాటు డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారు, ఆ అలవాటు వల్లే ఆయన తలపై వెంట్రుకలు ఊడిపోయాయి,” అని కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితోనే కాకుండా…. డ్రగ్స్ పరీక్షలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని, దమ్ముంటే బండి సంజయ్ కూడా పరీక్షలకు రావాలని ఆయన సవాల్ విసిరారు. బండి సంజయ్‌పై చేసిన ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ కార్యకర్తలు… పెద్ద సంఖ్యలో గంగుల కమలాకర్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయంపైకి దూసుకెళ్లారు. బీజేపీ కార్యకర్తలు లోపలికి చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం బయట ఉన్న కౌశిక్ రెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు.

 

ఇరువర్గాల మధ్య స్ట్రీట్ ఫైట్

 

బిజెపి కార్యకర్తలు గంగుల కమలాకర్ కార్యాలయంలో రచ్చ చేస్తున్న సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గందరగోళంలోనే బండి సంజయ్ కారును బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గొడవకు కారణమైన పలువురు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గంగుల క్యాంపు కార్యాలయంలోనే ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వాహనం ఎక్కే క్రమంలో కౌశిక్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తనపై రౌడీషీటర్లతో పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేయించారని ఆరోపించారు. ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని…. కేవలం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకే కౌంటర్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. తనపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

 

దాడిని ఖండించిన బీఆర్ఎస్

 

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వయంగా దాడులు చేయించడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారని…. క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్, అద్దాలు, కారు ధ్వంసం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్, ప్రతినిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులకు ఉసిగొల్పడం బాధాకరమన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు బీఆర్ఎస్ అగ్ర నాయకులను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడినా పోలీసులు ఏమాత్రం స్పందించకపోవడం, కేసులు పెట్టకపోవడం శోచనీయం. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసు, కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు అడ్డుకోలేదు. ఇలాంటి దాడులకు మేం భయపడం. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటాం” అని స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest