వనపర్తి (తెలంగాణ వాణి ప్రతినిధి): వరంగల్లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్-17 బాలికల హాకీ పోటీలకు పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారు. 9వ తరగతి చదువుతున్న రేవతి, 8వ తరగతి విద్యార్థినులు హరిని, శిల్ప రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు మండల విద్యాధికారి శాంతన్న, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కురుమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయుడు మన్యం యాదవ్ తెలిపారు. విద్యార్థినుల ఎంపిక పట్ల గ్రామ సర్పంచ్ గంగమ్మ రవి, ఉపసర్పంచ్ ఉషన్న యాదవ్, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.




