- తిమ్మాపూర్, నవంబర్ 12 (తెలంగాణ వాణి ప్రతినిధి):రాజధాని ఏసీ బస్సులో అకస్మాత్తుగా ఎమర్జెన్సీ అలారం మోగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కరీంనగర్ ఆర్టీసీ డిపో-1కు చెందిన రాజధాని ఏసీ బస్సు తిమ్మాపూర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై గురువారం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. ప్రయాణ సమయంలో బస్సులో ఎమర్జెన్సీ అలారం మోగడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. అలారం ఎంతకీ ఆగకపోవడంతో బస్సులో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమోనని ఆందోళన చెందారు.ఇటీవల జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి వరుస అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రయాణికుల్లో ఇప్పటికే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్‌తో నడిచే రాజధాని ఏసీ బస్సులోనూ ఎమర్జెన్సీ అలారం మోగడంతో ప్రయాణికులు మరింత ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన డ్రైవర్ ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించి, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయాలని కోరారు.బస్సు రహదారిపై నిలిచిపోవడంతో ప్రయాణికులంతా దిగివచ్చి ప్రత్యామ్నాయ బస్సు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే మరో బస్సు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారుల నుంచి తీవ్ర జాప్యం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ముఖ్యంగా వారిలో పలువురు హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లాల్సిన వారు ఉండటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. సమయానికి మరో బస్సు రాకపోతే తమ విమాన ప్రయాణాలు రద్దయ్యే ప్రమాదం ఉందని, తమకు కలిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం లభించలేదని వాపోయారు. డిపో మేనేజర్‌కు సమాచారం అందించినప్పటికీ తగిన స్పందన కనిపించలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.చివరకు ప్రత్యామ్నాయ బస్సు ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రయాణికులు వేరే బస్సులోకి మారి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన ఆర్టీసీ యంత్రాంగం, బస్సుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ముఖ్యంగా దూరప్రాంతాలకు, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికుల సమయపాలనను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చూడటంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.




