సిరుల సింగరేణిని కాపాడాలి..
కార్మికుల భవిష్యత్తును రక్షించాలి
కార్మికుల హామీలు అమలు చేయాలి
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి 1వ తేదీన జీతాలు చెల్లించాలి
కొత్తగూడెం, సెప్టెంబర్ 16 (తెలంగాణ వాణి) :సింగరేణి సంస్థను బలోపేతం చేసి, కార్మికుల ఉద్యోగ, ఆరోగ్య, సంక్షేమ భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో సింగరేణి సంస్థ ఆర్థిక, కార్మిక, ఉద్యోగ, సంక్షేమ సమస్యలపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, తరతరాలుగా వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సింగరేణి ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేయాలని రాకేష్‌రెడ్డి కోరారు. సంస్థకు రావాల్సిన విద్యుత్ రంగ బకాయిలు, అప్పులు, గత ఐదేళ్ల లాభనష్టాలు, కొత్త గనుల అభివృద్ధి, ఆధునిక యంత్ర పరికరాల కొనుగోళ్ల వివరాలను ప్రజల ముందుంచాలని అన్నారు. కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన 250 గజాల స్థలం, గృహ నిర్మాణ రుణాలు, ఇతర సంక్షేమ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో స్పష్టమైన విధానం ప్రకటించాలని, తీవ్రమైన అనారోగ్యంతో ఉద్యోగం చేయలేని కార్మికుల కుటుంబాల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. మెడికల్ బోర్డులపై కార్మికుల్లో ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలన్నారు. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్లు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, నిల్వలు, టెండర్లు, కొనుగోళ్లకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపించాలని రాకేష్‌రెడ్డి కోరారు. కొత్త గనుల అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, భద్రతా పరికరాలు, ఉత్పాదకత పెంపుతో పాటు కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా ఇవ్వాలి
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఆలస్యం కాకుండా ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారికి పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ డీఏలు విడుదల చేయడంతో పాటు పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో అందించాలని అన్నారు. సీపీఎస్–ఓపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ముగ్గురు మంత్రులు బాధ్యత తీసుకుని సమగ్ర సమీక్ష నిర్వహించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని రాకేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, బీఆర్ఎస్ యువ నాయకుడు సంకుబపన అనుదీప్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, టీజీబీకేఎస్ కేంద్ర కమిటీ నాయకుడు కుసనా వీరభద్రం, టీజీబీకేఎస్ నాయకులు తుమ్మ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ముత్యాల రాజేష్, సీనియర్ నాయకులు తోగరు రాజశేఖర్, రంగరాజు రాజేష్, సర్పంచులు రతన్ నాయక్, శ్రీకాంత్ నాయక్, మైనారిటీ నాయకులు మున్నీర్, శ్రీకాంత్, రమాకాంత్ భూపతి, జూపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




