UPDATES  

NEWS

 కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ

 

కరీంనగర్ నగర నడిబొడ్డున పట్టపగలే సాయుధ దోపిడీ జరగడం తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

కరీంనగర్ : మే 03 (తెలంగాణ వాణి ప్రతినిధి)

ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కస్టమర్ల ముసుగులో షోరూమ్‌లోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లిన వెంటనే ఆయుధాలు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో నలుగురు షోరూమ్ సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. భయాందోళనకు గురైన సిబ్బంది, కస్టమర్లు అక్కడి నుంచి పరుగులు తీశారు.

దుండగులు షోరూమ్‌లో ఉన్న భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

దొంగలు పారిపోతూ ఒక బుల్లెట్ మ్యాగజైన్‌ను అక్కడే వదిలిపెట్టగా, పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఇది కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది.

నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ వాహనంలో వచ్చారు, ఎటువైపు పారిపోయారనే విషయాలపై విచారణ కొనసాగుతోంది.

ఈ ఘటనతో కరీంనగర్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరం నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. సరిహద్దు జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.

పట్టపగలే రద్దీ ప్రాంతంలో ఇలాంటి దోపిడీ జరగడం సంచలనంగా మారింది. దొంగలు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారా లేదా స్థానికులా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest