కరీంనగర్ టౌన్, నవంబర్ 17 (తెలంగాణ వాణి ప్రతినిధి):నక్సల్స్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, గత 33 ఏళ్లుగా మంచానికే పరిమితమై నరకయాతన అనుభవిస్తున్న ఓ మాజీ సర్పంచ్ తనకు న్యాయం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను వేడుకున్నారు. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మంగళవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయానికి భార్యతో కలిసి ఆటోలో వచ్చారు. ఆటో నుంచి దిగలేని స్థితిలో ఉన్న ఆయనను గమనించిన బండి సంజయ్ స్వయంగా కార్యాలయం నుంచి బయటకు వచ్చి పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి తన దీనస్థితిని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. 33 ఏళ్ల క్రితం సర్పంచ్‌గా ఉన్న సమయంలో పోలీసులకు సమాచారం అందిస్తున్నారనే అనుమానంతో నక్సల్స్ తనను పట్టుకుని చేతులు కట్టేసి చిత్రహింసలకు గురిచేసి కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఘటనలో నడుము విరిగిపోయిందని, నడుము కింది భాగం పూర్తిగా స్పర్శ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ కాల్చిన తూటాలు ఇప్పటికీ తన శరీరంలోనే ఉన్నాయని, మలమూత్ర విసర్జన కూడా చేయలేని దుస్థితిలో ఉన్నానని కన్నీటిపర్యంతమయ్యారు.జీవితాంతం మందులపైనే ఆధారపడాలని వైద్యులు సూచించారని, కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని వివరించారు. ఎంఎస్సీ, బీఈడీ చదివిన తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతోపాటు, తాను జీవించినంతకాలం అవసరమైన మందులు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.శ్రీనివాసరెడ్డి పరిస్థితిపై స్పందించిన బండి సంజయ్, ఆయన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.





