పెద్దపల్లి, సెప్టెంబర్ 3
(తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి) మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన తీట్ల నవదీప్ (22)కు పెద్దపల్లి పోక్సో కోర్టు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించింది. 2025 ఏప్రిల్ 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాలిక తన తల్లికి విషయం తెలియజేయడంతో జూలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి కె. స్వప్నరాణి నిందితుడి నేరం రుజువైన నేపథ్యంలో శిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ సమర్థవంతమైన వాదనలు వినిపించి నేరం రుజువు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కేసు దర్యాప్తు, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంలో సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.



