విద్యుత్ సమస్యపై చైర్మన్ పుల్కం రాజు సత్వర స్పందన
నిమిషాల్లో వెలిగిన సెంట్రల్ లైట్లు
ఆది శ్రీనివాస్ సహకారంతో పట్టణ సుందరీకరణ
సెంట్రల్ లైటింగ్ లో చిన్నపాటి లోపాలపై తక్షణ చర్యలు
ప్రజల సహకారంతోనే వేములవాడ అభివృద్ది సాధ్యం
సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు భరోసా
వేములవాడ,సెప్టెంబర్ 02 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడ పట్టణ సుందరీకరణలో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థలో చిన్నపాటి సాంకేతిక లోపాలు తలెత్తడంతో కొన్నిచోట్ల దీపాలు వెలగకపోవడంపై మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు తక్షణమే స్పందించారు. విద్యుత్ వెలుగులు నిలిచిపోయిన ప్రాంతాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికుల నుంచి సమాచారం అందించిన వెంటనే ఆయన విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. చైర్మన్ ఆదేశాల మేరకు సమస్య వున్న స్థలానికి చేరుకున్న మున్సిపల్, విద్యుత్ శాఖ సిబ్బంది బుధవారం మరమ్మతులు పూర్తి చేసి లైట్లను తిరిగి పునరుద్ధరించారు.పట్టణాన్ని అంధకారం నుంచి విముక్తి చేసి, మరింత అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సహకారంతో ఈ సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా చైర్మన్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడ వెలగని లైట్లపై ఫిర్యాదు రాగానే వేగంగా స్పందించి పరిష్కరించామని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు మున్సిపల్ అధికారుల దృష్టికి లేదా నేరుగా తన వద్దకు తీసుకురావచ్చని, వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. వేములవాడ సమగ్ర అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని, సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.







