UPDATES  

 మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి..

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం (జులై 31) అర్ధరాత్రి కన్నుమూశారు. పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండె ఆగిపోవడం, నాడీ వ్యవస్థ స్పందించకపోవడంతో ఆయన మరణించారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. పెద్ది మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈరోజు పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

బాల్యం – జీవితం :

తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ గ్రామీణ జిల్లా (అప్పటి) నల్లబెల్లిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాజిరెడ్డి, అమృతమ్మ. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పెద్ది.. 1991లో వరంగల్‌లోని మహబూబియా పంజాథన్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం స్వప్నతో వివాహం జరగగా, వారికి కుమారుడు నిధర్షన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం :

యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సుదర్శన్ రెడ్డి 2001లో పార్టీ ఆవిర్భావ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వరంగల్ కేంద్రంగా జరిగిన సభలు, మహాగర్జన సభల్లో చురుకుగా పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా అకుంఠిత దీక్షతో విజయవంతంగా నిర్వహించేవారు.

తొలిసారి ఎమ్మెల్యేగా :

2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. 2018లో రెండో ప్రయత్నంలో ఘన విజయం సాధించి నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 నుంచి 2023 వరకు తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా, శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, తాగునీరు, వ్యవసాయ సమస్యలు, కరోనా కాలంలో సహాయక చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజా సేవలో చురుకైన నాయకుడిగా పార్టీ శ్రేణుల్లో, సాధారణ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రాంత ప్రజలు, తెలంగాణ రాజకీయ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. తెలంగాణ ఉద్యమ నేత నుంచి ఎమ్మెల్యే వరకూ ఆయన చేసిన ప్రజా సేవ, జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest