కాంగ్రెస్ ఫ్లెక్సీపై పేడ చల్లడంతో ముదిరిన వివాదం
పోలీసుల జోక్యంతో ఫ్లెక్సీల తొలగింపు.. సద్దుమణిగిన ఉద్రిక్తత
తిమ్మాపూర్, నవంబర్ 28 (తెలంగాణ వాణి ప్రతినిధి):దీక్ష దివస్ వేళ రాజకీయ ఫ్లెక్సీల వివాదం కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో అగ్గి రాజేసింది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన దీక్ష దివస్ ఫ్లెక్సీలు కాంగ్రెస్ నాయకుల ఆగ్రహానికి, అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు దళిత సంఘాల నిరసనకు కారణమయ్యాయి. కాంగ్రెస్ ఫ్లెక్సీపై బీఆర్ఎస్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, దానిపై కాంగ్రెస్ నాయకులు పేడ చల్లడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో అల్గునూర్ కూడలిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బీఆర్ఎస్ నాయకులు దీక్ష దివస్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కూడలిలోని అంబేద్కర్ విగ్రహం చుట్టూ కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో దళిత సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ వారు అల్గునూర్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దళిత సంఘాల నాయకులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో పాటు కాంగ్రెస్ ఫ్లెక్సీపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బందితో తొలగించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తమ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బీఆర్ఎస్ నాయకులు మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రచారం పేరుతో ఇతర పార్టీల ఫ్లెక్సీలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.




