UPDATES  

 నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లోకి వెళ్లను

పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్

రైతు భరోసా, బోనస్, యూరియా అంశాల్లో ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు

బీఆర్ఎస్ ఖాతాలోని రూ.1,400 కోట్లను అమరవీరుల కుటుంబాలకు పంచాలి

కొత్తగూడెంలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

 

కొత్తగూడెం, జూలై 9 (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల నిధులను తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పంపిణీ చేయాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె పలు రాజకీయ, ప్రజా సమస్యలపై మాట్లాడారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లో చేరుతానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. “నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు” అని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీతో భయం లేదని చెబుతూనే ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకలాపాలు, ప్రజా ఉద్యమాలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వకుండా ఒత్తిళ్లు తెస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ తన సన్నిహితులకు క్విడ్ ప్రో కో పద్ధతిలో అక్రమ అనుమతులు కల్పించారని, మీడియాపై కూడా ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు స్పష్టమైన సిద్ధాంతం, నీతి, నియమాలు లేవని విమర్శించిన కవిత, తెలంగాణ ఉద్యమకారులు, చిన్న కాంట్రాక్టర్లు, కార్మికుల కోసం పోరాడటంలో తానుఎల్లపుడు ముందే ఉంటానని పేర్కొన్నారు. ఉద్యమకారులకు న్యాయం జరగకపోవడం బాధాకరమన్న కవిత కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి ముఖ్య కారణమైన హరీశ్‌రావుని ఇంకా ప్రోత్సహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాళేశ్వరం అంశాన్ని ఉపయోగిస్తోందని విమర్శించారు. రైతు భరోసా, వడ్ల బోనస్, యూరియా పంపిణీ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రైతులపై అక్రమ కేసులు, రౌడీషీట్లు నమోదు చేయడం దారుణమని పేర్కొంటూ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని, కార్మికుల భద్రత, ఆధారిత ఉద్యోగాలు, మెడికల్ బోర్డు సమావేశాల నిర్వహణపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.

 

కేంద్ర ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన బొగ్గు గనులన్నింటినీ టెండర్లు లేకుండా కేటాయించాలని, తాడిచర్ల-2 గనిని పూర్తిగా సింగరేణియే నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తాను తెచ్చిన ఒత్తిడి వల్లే తాడిచర్ల 2 సింగరేణికి కేటాయించారని, ప్రైవేట్ సంస్థలకు గనులు అప్పగించడం వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని అన్నారు.

 

బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించిన కవిత, వ్యక్తిగత దూషణలు కాకుండా ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. తమ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికే కట్టుబడి పనిచేస్తుందని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest