నీకో దండం… నీ పార్టీకో దండం
పార్టీ పిరాయింపుదారులే హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తుండ్రూ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగిత్యాల (తెలంగాణ వాణి)
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారు..నీకో దండం..నీ పార్టీకో దండం..పార్టీ పిరాయింపుదారులే హత్యారాజకీయాలు ప్రోత్సహిస్తుం డ్రని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సొంత కాంగ్రెస్ పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి హత్యకు గురి కాగా ఆందోళన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో నీకోదండం… నీ పార్టీకో దండం…కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నా’ అంటూ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వం లో గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న మారు గంగారెడ్డి వ్యక్తిని జాబితాపూర్ గ్రామంలో సంతోష్ అనే వ్యక్తి కత్తులతో పొడిచి హతమార్చి పోలీసులకు లొంగిపోయాడన్నారు. సంతోష్ వెనుక బలమైన శక్తులు ఉండి ఈనేరాన్ని చేయడానికి ప్రలోభ పెట్టాలని నిందితుడిని వెనక ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారని ఎమ్మెల్సీ ద్వజమెత్తారు. దారుణ హత్యతో కాంగ్రెస్ లో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నారు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోవడంతో ఇలాంటి హత్యలు జరుగుతున్నా యని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం రావడానికి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నా గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా ఫిరాయింపులను ప్రోత్సహించి గత కొన్నేళ్ల నుండి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు అన్యాయం చేస్తుందని జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుందని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. తామెన్ని అవమానాలకు గురవుతున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులను నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్ నష్టపోతుందని స్పష్టం చేశారు. వెంటనే ఈ నేరానికి పాల్పడ్డ వారితోపాటు వారి వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మారు గంగారెడ్డి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు కారుతో గుద్ది కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో జగిత్యాల పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నా రాస్తారోకో చేస్తుండగా ఇదే విషయంలో డిఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ నేరం చేసిన ఎవరిని వదిలేదిలేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలతో ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా సమన్వయం పాటించాలని కోరారు. నేరం చేసిన వ్యక్తి సంతోష్ ను ఆదిలోకి తీసుకొని శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వెల్లడించారు.