హైడ్రా దృష్టిలో సినీ, రాజకీయ, బడబాబులు ఎవరైనా ఒక్కటే అంటున్న రంగనాధ్
హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)
హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతను నిర్వహిస్తున్నారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందింది. తుమ్మిడి చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతకు ఉపక్రమించారు.
కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ అక్రమ నిర్మాణాలపై కీలక ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూల్చేస్తామని చెప్పారు. దీంతో మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును కబ్జా చేసి మూడున్నర ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో ఇవాళ ఉదయమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు అధికారులు పూనుకున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. ఈ క్రమంలోనే 44 ఏళ్ళలో అంటే 1979 నుంచి 2023 వరకూ నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది.
శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించిన వివరాలను హైడ్రాకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అందజేసింది. వాస్తవ విర్తీర్ణం.. ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని ఇచ్చింది. దీని ఆధారంగా కబ్జాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌కన్వెన్షన్‌పై చర్యలకు దిగింది. జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్‌ను కూల్చి వేస్తారంటూ వార్తలొచ్చాయి. కోర్టుకు వెళ్లడంతో జువ్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత ప్రక్రియ నిలిచిపోయింది…