కొత్తగూడెం, నవంబర్ 6 (తెలంగాణ వాణి):ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన 108 అత్యవసర వైద్య సేవల సిబ్బందికి రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయ శిక్షణ బృందం ఆధ్వర్యంలో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించే విధానాలు, సిబ్బంది నైపుణ్యాల మెరుగుదలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో బాధితులకు వేగంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో 108 సిబ్బంది పాత్ర కీలకమని అన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తత, సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్.కె. నసీరుద్దీన్, జిల్లా మేనేజర్లు సతీష్, ప్రణయ్, మనోజ్, శిక్షణ బృంద సభ్యులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





