2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం
బీఆర్ఎస్ పాలనలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశాం
పార్టీలో గౌడు తిరుపతిరెడ్డి చేరికకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేత
వరంగల్, నవంబర్ 22 (తెలంగాణ వాణి ఉమ్మడి వరంగల్ బ్యూరో): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఓరుగల్లు కీలక పాత్ర పోషించిందని, ఉద్యమ సమయంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వరంగల్ ప్రజలు ఉద్యమానికి అండగా నిలిచారని బీఆర్ఎస్ నాయకుడు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓరుగల్లు ప్రజల సహకారం, అభిమానాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. 2028లో కేసీఆర్ తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనే విశ్వాసం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌడు తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరడాన్ని స్వాగతించారు. ఆయనతో పాటు భవిష్యత్తులో మరింత మంది పార్టీలో చేరుతారని, వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున చేరికలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్‌లో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ నవంబర్ 29న అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న సందర్భాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఓరుగల్లు ప్రజల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీరు, తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో అన్ని వర్గాలకు అండగా నిలిచామని వివరించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను కొనసాగించామని పేర్కొన్నారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందలాది సంక్షేమ పథకాలను అమలు చేశామని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా సుమారు 18 లక్షల మంది ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టామని గుర్తుచేశారు.
రేషన్ బియ్యం పంపిణీని ఒక్కొక్కరికి నాలుగు కిలోల నుంచి ఆరు కిలోలకు పెంచామని, జీవో 58, 59 ద్వారా అర్హులకు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించామని వివరించారు. వృద్ధులు, వితంతువులు తదితర అర్హులకు పెన్షన్లను రూ.2 వేలకు పెంచి ఆర్థిక భరోసా కల్పించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, నాలుగు నెలల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలను సభలో ప్రదర్శిస్తూ ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలో వరంగల్‌కు చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో భాగంగా ఎల్ఈడీ తెరపై అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ప్రదర్శించేందుకు సభికులను కూర్చోవాలని కోరారు. 




