తిమ్మాపూర్,నవంబర్ 08 ( తెలంగాణ వాణి ప్రతినిధి):పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన మార్కాపురం లావణ్య–రమేష్ దంపతుల ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మమేకమై టపాసులు పేల్చి పండుగ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పొందిన పేద కుటుంబంతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. సొంతింటిలో పండుగ జరుపుకోవడం లబ్ధిదారుల కుటుంబాల్లో కొత్త ఆనందాన్ని నింపిందన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ దుర్గం మహేష్, గ్రామ సర్పంచ్ శోభారాణి, తిమ్మాపూర్, మానకొండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారు రమేష్, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు శ్రీగిరి రంగారావు, కుంట రాజేందర్ రెడ్డి, గోపు మల్లారెడ్డి, మామిడి అనిల్ కుమార్, బుదారపు,నోముల అనిల్, రాముల యాదవ్, ఎలక రాజు, గ్రామ కార్యదర్శి అనిల్ కుమార్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.





