ఖమ్మం (తెలంగాణ వాణి) ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావును పార్టీ ముందస్తుగా ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయిలో సేవలందించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందించారు.
జనసేన పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయన అభ్యర్థిత్వానికి పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేయడంతో ఉమ్మడి మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీనివాసరావు పేరును జనసేన పార్టీ ముందస్తుగా ప్రకటించింది.
ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టభద్రులు, ఉద్యోగులు, యువత, విద్యావంతులు, మేధావుల సమస్యలను శాసన మండలి వేదికగా బలంగా వినిపించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రులు, మేధావులు, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు తనకు ఆశీస్సులు అందించి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు జనసేన పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జాతీయ కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్‌కు డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి మూడు జిల్లాల పట్టభద్రుల మద్దతుతో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని తెలంగాణలో జనసేన పార్టీ సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
“పట్టభద్రుల గొంతుకగా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం..” అనే నినాదంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. డాక్టర్ గడల శ్రీనివాసరావుకు ఉమ్మడి మూడు జిల్లాల పట్టభద్రులు తమ ఆశీస్సులు, ఆదరణ అందించాలని జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు.

