UPDATES  

 నేడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రులు..

నేడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రులు..

దాదాపు రూ.15.22 కోట్ల పనులను ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్

వేములవాడ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన

ఆహ్లాదకరంగా సిద్ధమైన గుడి చెరువు బండ్ పార్క్

సిరిసిల్ల ఖ్యాతిని మరింత ఇనుమడించేలా వస్త్రం తయారీ దశల నమూనాలు

ఆకట్టుకుంటున్న మోడల్ బస్ స్టేషన్లు

రాజన్న సిరిసిల్ల,జూలై 30 (తెలంగాణ వాణి) : జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పర్యటించ నున్నారు. దాదాపు రూ.15 కోట్ల 22 లక్షల నిధులతో పూర్తి చేసిన పనులను ప్రారంభించ నున్నారు. రూ. కోటి 65 లక్షలతో వేములవాడ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణతో ఈ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తయ్యాయి. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన ఈ పనులు జిల్లాలో పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధికి మరింత దోహదపడనున్నాయి.

ఆహ్లాదకరంగా గుడి చెరువు బండి పార్క్ :

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో బండ్ పార్క్ ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంది. మహా శివుడి విగ్రహం మరింత ఏర్పాటుతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది.

పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నిధులు రూ. 12 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో బండ్ పార్క్ నిర్మాణ పనులు చేపట్టారు.

గుడి చెరువు అభివృద్ధి పనులను గత ఆరు నెలల క్రితం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ప్రణాళిక ప్రకారం చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ఆధ్యాత్మికత భావం ఉట్టిపడేలా, భక్తి భావం పెంపొందించేలా మహాశివుడి విగ్రహంతో పాటు, సప్తమాత్రికల విగ్రహాలు, అలాగే గుడి చెరువులో బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అధికారులు బండ్ పార్క్ లో 40 ఫీట్ల ఎత్తైన మహాశివుడి విగ్రహం, సప్తమాత్రికల విగ్రహాలు ఏర్పాటు చేశారు. గుడి చెరువులో బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.బండ్ పార్క్ లో నటరాజ్ స్టాచ్యూ ఫౌంటెన్,సూర్య నమస్కార్, వాకింగ్ ట్రాక్, కోబుల్ స్టోన్ ఫ్లోరింగ్,ల్యాండ్ స్కేప్, అంప్లీ థియేటర్, తదితర పనులు పూర్తి చేసి ఆకర్షణీయ మొక్కలు నాటారు.

సిరిసిల్ల ఖ్యాతిని మరింత చాటేలా.. ప్రత్యేక ఆకర్షణగా రగుడు బై పాస్ జంక్షన్ :

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత చాటేలా వస్త్ర ఉత్పత్తి దశలు అందరికీ అర్థం అయ్యేలా ఏర్పాటు చేసిన నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులు, వివిధ ప్రాంతాల ప్రజలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వస్త్ర ఉత్పత్తిలో వివిధ దశలను తెలుసుకునేలా ఏర్పాటు చేసిన నమూనాలపై హర్షం వ్యక్తం అవుతుంది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పనులను పలుమార్లు పరిశీలించి వేగంగా.. ఆకర్షణీయంగా పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఇరువైపులా రోడ్డును విస్తరింపజేశారు. అలాగే రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా సైన్ బోర్డ్స్ ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలని రోడ్డు సేఫ్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. రూ. 3 కోట్ల 10 లక్షలతో రగుడు బై పాస్ జంక్షన్ సుందరీకరణ లో భాగంగా బీటీ రోడ్డు విస్తరణ, హై మాస్ లైట్లు, గ్రీనరీ, రోడ్డు భద్రత చర్యలు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ లో వివిధ దశల నమూనాలు సిద్ధం చేశారు.

మోడల్ బస్ షెల్టర్స్ :

ప్రయాణికులు, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయం ఉద్యోగులు, పరిసర ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం రగుడు బై పాస్ జంక్షన్ వద్ద కరీంనగర్ రోడ్డులో.. కామారెడ్డి రోడ్డులో రూ. 12.50 లక్షలతో మోడల్ బస్ షెల్టర్స్ సిద్దం చేశారు. అందరికీ ఎంతో ఉపయోగకరంగా అందుబాటులో ఉంది.

నేడు వేములవాడ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం :

కోటి 65 లక్షల రూపాయలతో వేములవాడ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆఫీసు రూమ్స్, బస్ స్టాండ్ ఆవరణ సుందరీకరణ, పచ్చదనం పెంపు తదితర పనులు చేయనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest