కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (తెలంగాణ వాణి): కొత్తగూడెం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు గత నాలుగేళ్లుగా సబ్బులు, బట్టలు, నూనె, బెల్లం, చెప్పులు, పని పరికరాలు అందించకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సెవెన్ హిల్స్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న వస్తువులను వెంటనే అందించాలని కార్మికులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్ మాట్లాడుతూ.. కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలిందన్నారు. పని భారం పెరిగిన నేపథ్యంలో పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని, గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వస్తువులను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల వివక్ష చూపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ధర్నా నేపథ్యంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ కార్మికులు, నాయకులతో చర్చించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం (సిఐటియు ) రాష్ట్ర కమిటీ సభ్యురాలు అంబాల దుర్గమ్మ, యూనియన్ నాయకులు చందర్, సుశీల, అశోక్ , నరశయ్య , మల్లీశ్వరి, రాజలక్ష్మి, సునీల్, సంజీవ్ ,ప్రకాష్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.




