మనిషి లో సద్గుణాలు పెంచేది దసరా

సామాజిక వేత్త, విశ్లేషకులు.సెల్ : 9949194327.
దసరా అనేది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే పండుగ.దైవారాధన, ఉపాసన, నియమ నిష్ఠలతో జరుపుకునే ఈ పండుగ దక్షిణాయనంలో వచ్చే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో దసరాను జరుపుకుంటారు.ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ.ఉత్తర భారతదేశంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి.దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు.అనంతరం విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి, అతనిపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ దుర్గామాత విగ్రహాలను అలంకరించి పూజిస్తారు. ఈ విజయదశమి రోజున అత్యంత నియమ నిష్టలతో భక్తితో దుర్గాపూజ నిర్వహిస్తారు.నవరాత్రులు ముగిసిన తర్వాత పదో రోజు (ఈ ఏడాది 11వ రోజు) దసరా లేదా విజయదశమి పండుగ జరుపుకుంటారు.ఈ విజయదశమి పండుగను ప్రాంతాలను బట్టి విభిన్న ఆచారాలతో వైభవంగా జరుపుకుంటారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి అని పిలుస్తారు.ఈ ఏడాది ఈ విజయదశమి పండుగను అక్టోబర్ 2న జరుపుకోనున్నారు.దసరా అంటే పదిజన్మల పాపాలను పోగొట్టేది, పది రకాల పాపాలను తొలగించేది అని అర్థం. అందుకే దీన్ని ‘నవరాత్ర వ్రతం’, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అని కూడా అంటారు.తొమ్మిది రోజులు జగన్మాతను పూజించి పదవ రోజున విజయాన్ని పొందడం వల్ల పదవ రోజు విజయదశమిగా పరిగణిస్తారు.నవరాత్రి అంటే కొత్త రాత్రులు అనే అర్థం.తొమ్మిది అనేది పూర్ణత్వానికి సంకేతం కాబట్టి,పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించడం నవరాత్రుల లక్ష్యం.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు, ఈ పది రోజులు భక్తులు జగన్మాతను వివిధ రూపాల్లో ఆరాధిస్తారు.మొదటి రోజున బాలా త్రిపురసుందరి గా,
రెండవ రోజు గాయత్రి మాత గా,
మూడవ రోజు అన్నపూర్ణాదేవి గా,నాల్గవ రోజు మహాలక్ష్మి గా,
ఐదవ రోజు లలిత త్రిపురసుందరి గా,ఆరవ రోజు రాజరాజేశ్వరి గా,
ఏడవ రోజు మహాసరస్వతి గా,ఎనిమిదవ రోజు దుర్గాదేవి గా,తొమ్మిదవ రోజు మహిషాసురమర్దిని గా,పదవ రోజు అపరాజితా దేవిగా పూజిస్తారు.ఈ సమయంలో భక్తులు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తూ మంత్రజపం,పారాయణం, భజనలు, ఉపవాసం చేస్తారు.చివరి రోజున ప్రత్యేక పూజలు చేసి పిండివంటలతో నైవేద్యం సమర్పించి, ప్రసాదాన్ని బంధుమిత్రులతో పంచుకుంటారు.విజయదశమి రోజు దుష్టత్వంపై దైవత్వం సాధించిన విజయానికి ప్రతీక.ఈ రోజున అర్జునుడు శమీవృక్షం నుంచి ఆయుధాలను తీసుకుని కౌరవులను ఓడించాడు.శమీ వృక్షాన్ని పూజించడం,శమీ పత్రాలను పెద్దలకు ఇవ్వడం ఆనవాయితీ.శ్రీ రాముడు రావణుడిని సంహరించిన రోజు ఇదే.అందుకే రామలీల ప్రదర్శనలు, రావణ దహనం జరుగుతాయి.మహిషాసురుడనే రాక్షసుడు తన తపోశక్తితో బ్రహ్మదేవుడి నుంచి ఓ వరం పొందుతాడు. అదేమిటంటే తాను ఏ పురుషుడి చేతిలో మరణం పొందకూడదని వరం పొందుతాడు. ఈ వరం పొందాక అతను దేవతలను వేధిస్తుంటాడు. ఆసమయంలో దేవతలందరూ తమ శక్తులను ఓచోట చేర్చి దుర్గాదేవిని సృష్టిస్తారు. ఈ దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుడనే ఆ రాక్షసుడితో యుద్ధం చేసి 10వ రోజు అతడిని సంహరిస్తుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు.విజయదశమి కేవలం పండుగ మాత్రమే కాదు.ఇది మనలోని ఆసురీ గుణాలను తొలగించి, దైవీ గుణాలను పెంపొందించుకోవాలని గుర్తు చేస్తుంది.కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం వంటి అరిషడ్వర్గాలను జయించడం ద్వారానే జగన్మాత కృప లభిస్తుంది.మనం భౌతిక రాక్షసులతో కాదు,అంతర్గత దుర్గుణాలతో యుద్ధం చేసి,శుద్ధ సత్వగుణాన్ని పొందాలి.విజయదశమి రోజున భక్తులు తాము రోజు వారి ఉపయోగించే పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, ఆయుధాలను పూజిస్తారు. ఇది వృత్తిపరమైన విజయానికి గుర్తుగా, ఆయుధాలకు కృతజ్ఞత తెలిపేందుకు అవకాశంగా భావిస్తారు.దసరా నవరాత్రుల్లో మహా నవమి రోజున ఈ ఆయుధ పూజ నిర్వహిస్తారు. దీని వెనుక ఉన్న కథేమిటంటే పాండవులు అజ్ఞాతం ముగించిన తర్వాత తిరిగి తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై నుంచి తీసి పూజించిన తర్వాత కౌరవులను ఓడించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని కూడా ఆయుధపూజ చేస్తారని చెబుతారు.విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక విశిష్టమైన ఆచారం.ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది. విజయదశమి రోజున జమ్మిచెట్టును పూజించి జమ్మి ఆకులను బంగారంలా భావించి ఒకరికొకరు పంచుకుంటారు. ఇలా జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్నీ రంగాల్లో విజయం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. ఇలా చెడు పై మంచి జయించడం జరుగుతుంది.దసరా పండుగలో భాగంగా ఆయుధపూజ అనేది విజయదశమికి ముందు రోజు, అంటే నవమి నాడు చేసే ఒక విశిష్టమైన ఆచారం. ఈ పండుగ, దుర్గాదేవి రాక్షసరాజు మహిషాసురుడిని, శ్రీరాముడు రావణాసురుడిని వధించి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా, ప్రజలు తమ ఆయుధాలు, వాహనాలు, యంత్రాలను, పనిముట్లను పూజించి వాటికి కృతజ్ఞతలు తెలుపుతారు.ఆయుధపూజ తర్వాత కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు.అందుకే దసరా ను శుభకార్యాలకు నిలవుగా చెప్తారు.