ప్రజారోగ్య పరిరక్షణకు ముందస్తు చర్యలు
పనులను పర్యవేక్షించిన సర్పంచ్ శాంతిశ్రీ, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి
చుంచుపల్లి /విద్యానగర్ (తెలంగాణ వాణి) వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు, ముసురు వర్షాల నేపథ్యంలో గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై విద్యానగర్ గ్రామపంచాయతీ ప్రత్యేక దృష్టి సారించింది. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలను శుభ్రం చేసే పనులను ముమ్మరంగా చేపట్టింది. ఈ పనుల్లో సర్పంచ్ శాంతిశ్రీ, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి స్వయంగా పాల్గొని శానిటేషన్ సిబ్బందికి సూచనలు చేస్తూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వర్షాల కారణంగా మురుగునీరు నిలిచిపోకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం సూచించింది




